రేణికుంటలో ఇసుక రీచ్ ప్రారంభం.. యువతకు ఉపాధి కల్పన లక్ష్యమని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ

కరీంనగర్, జూన్ 13 (కే24 న్యూస్): కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణికుంట గ్రామంలో ఏర్పాటు చేసిన ఇసుక రీచ్‌ను శనివారం ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఏసీపీ విజయ్ కుమార్‌తో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంత యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఇసుక రీచ్‌ను ప్రారంభించినట్లు తెలిపారు. ఇసుక రవాణా పూర్తిగా నిబంధనలకు అనుగుణంగా, పారదర్శకంగా జరగాలని ట్రాక్టర్ యజమానులకు సూచించారు. అక్రమ రవాణాకు పాల్పడకుండా ప్రభుత్వ నిబంధనలను పాటించాలని కోరారు.
అలాగే ఇసుక ట్రాక్టర్లు అధిక వేగంతో నడపడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, డ్రైవర్లు అప్రమత్తంగా వ్యవహరించి తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా కాపాడాలని సూచించారు.
ప్రస్తుత పరిస్థితుల్లో కొంతమంది యువత గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు బానిసలై జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేసిన ఎమ్మెల్యే, యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి ఉపాధి, అభివృద్ధి దిశగా అడుగులు వేయాలని పిలుపునిచ్చారు.
రేణికుంట గ్రామ ప్రజల సంక్షేమమే తన లక్ష్యమని పేర్కొన్న ఆయన, గ్రామ అభివృద్ధికి ఎల్లప్పుడూ కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం గ్రామస్తులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలియజేశారు.

 

Picture of కె24 న్యూస్ తెలుగు

కె24 న్యూస్ తెలుగు

Katta Ravinder is a journalist with five years of experience in print and electronic media, committed to responsible journalism.