హనుమాన్ నగర్ కాలనీలో భక్తిశ్రద్ధలతో అన్నప్రసాద వితరణ.. ప్రశాంతంగా గణేష్ నిమజ్జనం నిర్వహించాలి: డీఎస్పీ ఎస్. మధుసూదన్

కామారెడ్డి జిల్లా :k24 న్యూస్ తెలుగు : కామారెడ్డి పట్టణంలోని హనుమాన్ నగర్ కాలనీ వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో కామారెడ్డి డీఎస్పీ ఎస్. మధుసూదన్, కామారెడ్డి రూరల్ సీఐ శ్రీధర్, దేవునిపల్లి ఎస్‌హెచ్‌ఓ రంజిత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులు గణనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొని భక్తులతో కలిసి ప్రసాదాన్ని స్వీకరించారు.

ఈ సందర్భంగా డీఎస్పీ ఎస్. మధుసూదన్ గారు గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, కాలనీవాసులతో మాట్లాడి గణేష్ ఉత్సవాలు, నిమజ్జన ఏర్పాట్లపై వివరాలు తెలుసుకున్నారు. గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని సూచించారు.

నిబంధనల ప్రకారం డీజేలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి లేదని, సంప్రదాయాలకు ప్రాధాన్యతనిస్తూ డప్పులు, సంప్రదాయ వాయిద్యాలతోనే గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలని డీఎస్పీ స్పష్టం చేశారు. దీనికి స్పందించిన గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు పోలీసుల సూచనలను పాటిస్తూ భక్తి, బాధ్యత, భద్రతతో నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించుకుంటామని హామీ ఇచ్చారు.
గణనాథుడి ఆశీస్సులు తీసుకోవడంతో పాటు అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. కాలనీవాసుల ఐకమత్యం, పోలీసులకు అందిస్తున్న సహకారం అభినందనీయమన్నారు. ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా నిబంధనలకు లోబడి గణేష్ ఉత్సవాలను నిర్వహించుకోవాలని, ప్రతి ఒక్కరూ భద్రతకు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.

గతంలో జరిగిన చోరీ కేసును వారం రోజుల్లో ఛేదించిన పోలీసులు

హనుమాన్ నగర్ కాలనీలో గతంలో జరిగిన చోరీ ఘటనలో నాలుగు తులాల బంగారం, పది తులాల వెండి చోరీకి గురయ్యాయి. ఈ ఘటనపై దేవునిపల్లి పోలీసులు ప్రత్యేక దృష్టి సారించి సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించి నిందితులను గుర్తించి వారం రోజుల్లోనే చోరీ కేసును ఛేదించారు. చోరీకి గురైన నాలుగు తులాల బంగారం, పది తులాల వెండిని రికవరీ చేసి బాధితులకు అప్పగించారు.

తమ కాలనీలో జరిగిన చోరీ కేసును కేవలం వారం రోజుల్లోనే ఛేదించి, చోరీ సొత్తును రికవరీ చేసి తమకు న్యాయం చేసినందుకు హనుమాన్ నగర్ కాలనీవాసులు పోలీసు అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. డీఎస్పీ ఎస్. మధుసూదన్, సీఐ శ్రీధర్, ఎస్‌ఐ రంజిత్‌తో పాటు జిల్లా ఎస్పీ శ్రీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ
కాలనీవాసులు డీఎస్పీ ఎస్. మధుసూదన్, సీఐ శ్రీధర్, ఎస్‌ఐ రంజిత్‌లను ఘనంగా సన్మానించారు. భవిష్యత్తులో కూడా పోలీసులకు తమ పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో హనుమాన్ నగర్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు బొట్టు శీను, శంకర్, లక్ష్మారెడ్డి, గోపాల్‌రావు, సతీష్‌రెడ్డి, నారాయణరావు, నాగరాజు, సుదర్శన్, గంగాధర్ నాయక్, గోపాల్‌రావు, చిన్న శంకరప్ప, రాజమౌళి, గంగాధర్, సీతారాములు, రామకృష్ణయ్య తదితరులు, కాలనీవాసులు పాల్గొన్నారు.

Picture of కె24 న్యూస్ తెలుగు

కె24 న్యూస్ తెలుగు

Katta Ravinder is a journalist with five years of experience in print and electronic media, committed to responsible journalism.