రైతులను రాజు చేసేందుకే ప్రత్యేక కార్యాచరణ: కవిత

రైతు సమస్యలపై నల్గొండలో రౌండ్ టేబుల్ సమావేశం

 

నల్గొండ, తెలుగు కే న్యూస్ జూన్ 11: రైతుల సమస్యల పరిష్కారానికి తెలంగాణ రక్షణ సేన ప్రత్యేక కార్యాచరణ చేపడుతుందని ఆ పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత తెలిపారు. నల్గొండలో నిర్వహించిన రైతు సమస్యలపై రౌండ్ టేబుల్ సమావేశం ముగింపు సందర్భంగా ఆమె మాట్లాడారు.
ప్రభుత్వాలకు స్పష్టమైన విధానం, ఉక్కు సంకల్పం ఉంటే వ్యవసాయ రంగంలో అద్భుతాలు సాధించవచ్చని అన్నారు. అయితే ప్రస్తుతం రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు కేవలం సానుభూతి చూపుతున్నట్లు వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. వ్యవసాయాన్ని ఒక పరిశ్రమగా గుర్తించి పారిశ్రామికవేత్తలకు కల్పించే సౌకర్యాలన్నీ రైతులకు కూడా అందించాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం తరుగు పేరుతో క్వింటాకు 6 కిలోల చొప్పున కోత విధించడం ద్వారా రైతులకు రూ.1,000 కోట్లకు పైగా నష్టం కలిగించిందని ఆరోపించారు. రవాణా, ప్యాకింగ్ ఖర్చులను కూడా రైతులపైనే మోపడం వల్ల మరో రూ.200 కోట్ల భారం పడిందన్నారు. మొత్తంగా రూ.1,200 కోట్ల మేర రైతులపై భారం మోపిన ప్రభుత్వం సిగ్గుపడాలని వ్యాఖ్యానించారు.
నల్గొండ జిల్లాలో నీటి ప్రాజెక్టులు ఎండిపోవడం, లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు నిర్వహణ లేక పనిచేయకపోవడం ఆందోళన కలిగించే విషయమన్నారు. జిల్లాకు చెందిన ఇరిగేషన్ మంత్రి ఉన్నప్పటికీ సమస్యలపై దృష్టి సారించడం లేదని విమర్శించారు.
రాష్ట్రంలో 36 శాతం మంది కౌలు రైతులేనని, వారిని గుర్తించి రైతు భరోసా పథకం వర్తింపజేయాలని కోరారు. రైతు కూలీలకు హామీ ఇచ్చిన రూ.12 వేల ఆర్థిక సాయాన్ని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే వ్యవసాయాన్ని గ్రామీణ ఉపాధి హామీ పథకంతో అనుసంధానం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్న కవిత, రైతు పండించిన పంటకు బ్రాండింగ్ కల్పిస్తే విలువ పెరుగుతుందని చెప్పారు. నల్గొండ జిల్లాలో నిమ్మ, బత్తాయి రైతులకు మార్కెటింగ్ సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
సమావేశంలో 10 తీర్మానాలు
రౌండ్ టేబుల్ సమావేశంలో రైతు సమస్యల పరిష్కారానికి 10 కీలక తీర్మానాలు ఆమోదించినట్లు కవిత వెల్లడించారు. రైతు డిస్కం రద్దు, యూరియా యాప్ ఉపసంహరణ, బకాయి రైతు భరోసా నిధుల విడుదల, కౌలు రైతులకు రైతు భరోసా అమలు, రైతు కూలీలకు రూ.12 వేల ఆర్థిక సాయం, నకిలీ విత్తనాలు–పురుగుమందుల విక్రయాలపై కఠిన చర్యలు, మూసీ కాలుష్య నివారణ, నిమ్మ–బత్తాయి రైతులకు మద్దతు, పత్తి రైతుల సమస్యల పరిష్కారం, రైతు సమస్యలపై ఉమ్మడి ఉద్యమ కార్యాచరణ వంటి అంశాలు తీర్మానాల్లో ఉన్నాయని తెలిపారు.
నిరుద్యోగులకు హామీ ఇచ్చిన రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని, కానిస్టేబుల్ పోస్టులను పెంచాలని, జీవో 46ను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉద్యమకారుల సమస్యల పరిష్కారం కోసం కూడా పోరాటం కొనసాగిస్తామని పేర్కొన్నారు. జూలై 2న ఉప్పల్ భగాయత్ భూముల అంశంపై చేపట్టనున్న ఉద్యమానికి నల్గొండ జిల్లా నుంచి పెద్ద ఎత్తున ప్రజలు, ఉద్యమకారులు తరలిరావాలని పిలుపునిచ్చారు.

Picture of కె24 న్యూస్ తెలుగు

కె24 న్యూస్ తెలుగు

Katta Ravinder is a journalist with five years of experience in print and electronic media, committed to responsible journalism.