
చేర్యాల, జూన్ 25 (తెలుగు కే న్యూస్): చేర్యాల మున్సిపల్ పరిధిలో ప్రభుత్వ నిధులతో నిర్మిస్తున్న సీసీ రోడ్లలో నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదని సీపీఎం పట్టణ కార్యదర్శి రాళ్లబండి నాగరాజు ఆరోపించారు. గురువారం పార్టీ నాయకులతో కలిసి పలు వార్డుల్లో జరుగుతున్న పనులను పరిశీలించిన ఆయన, నాసిరకం సామగ్రితో రోడ్లు నిర్మిస్తున్నారని, అధికారులు పర్యవేక్షణ లేకుండానే బిల్లులు మంజూరు చేస్తున్నారని విమర్శించారు. క్వాలిటీ కంట్రోల్ అధికారులతో విచారణ జరిపి, నివేదిక అనంతరమే బిల్లులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు పోలోజు శ్రీహరి, ఆముదాల నర్సిరెడ్డి, ముత్యాల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.


