కె 24 తెలుగు న్యూస్ ప్రతినిధి సతీష్ చారీ దర్యాపూర్ తండాలో ఘనంగా సీత్లా భవాని పండుగ

నిజామాబాద్ జిల్లా, నవీపేట్ మండల్ :-దర్యాపూర్ తండాలో లంబాడీల ఆరాధ్య దైవమైన సీత్లా భవాని పండుగను మంగళవారం సంప్రదాయబద్ధంగా ఘనంగా నిర్వహించారు. లంబాడీ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఈ పండుగను ప్రతి ఏడాది ఆషాఢ మాసంలోని మంగళవారం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. వ్యవసాయ పనుల ప్రారంభానికి సంకేతంగా భావించే ఈ వేడుకలో తండా సరిహద్దులోని పొలిమేర, కూడలి వద్ద సీత్లా భవానిని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
డప్పు వాయిద్యాల నడుమ పురుషులు కోళ్లు, మేకలతో ఊరేగింపుగా వెళ్లగా, మహిళలు, యువతులు బోనాలు ఎత్తుకుని సంప్రదాయ నృత్యాలతో వేడుకలో పాల్గొన్నారు. అమ్మవారికి గుగ్గిళ్లు (ఘుగ్రీ), లాప్సీ (పాయసం) నైవేద్యంగా సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కోళ్లు, మేకలను బలిచ్చి వాటి పైనుంచి పశువులను దాటించారు. ఇలా చేయడం వల్ల పిల్లలు ఆరోగ్యంగా ఉండటంతో పాటు పాడి పంటలు సమృద్ధిగా పండుతాయని లంబాడీలు విశ్వసిస్తారు.
పెద్దమనిషి పూజారిగా వ్యవహరించి సంప్రదాయ పద్ధతిలో పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక వార్డు సభ్యుడు మెగావత్ ప్రేమ్ సింగ్, గ్రామ పెద్దలు, మహిళలు, యువతతో పాటు తండా ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Picture of కె24 న్యూస్ తెలుగు

కె24 న్యూస్ తెలుగు

Katta Ravinder is a journalist with five years of experience in print and electronic media, committed to responsible journalism.