
కామారెడ్డి జిల్లా అక్టోబర్ 2 : k24 న్యూస్ తెలుగు : బాన్సువాడ పట్టణంలోని గౌలిగూడ కాలనీకి చెందిన ఫిర్యాదుదారు శ్రీ చింతల భాస్కర్ తన భార్యతో కలిసి మధ్యాహ్నం సుమారు 02:30 గంటలకు ఇంటికి తాళం వేసి తన కిరాణా దుకాణానికి వెళ్లారు. అదే రోజు సాయంత్రం సుమారు 6:30 గంటలకు తిరిగి ఇంటికి వచ్చేసరికి ఇంటి తాళం పగులగొట్టి ఉండటాన్ని గమనించారు. ఇంటిలోని పై అంతస్తులో ఉన్న బెడ్రూమ్లోని లాకర్‌ను గుర్తుతెలియని వ్యక్తులు తెరిచి, అందులో ఉన్న బంగారు ఆభరణాలు, వెండి ఆభరణాలు, నగదు మరియు ఇన్వర్టర్ను దొంగిలించినట్లు గుర్తించారు. ఈ మేరకు ఫిర్యాదుదారు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా బాన్సువాడ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర, ఆదేశాల మేరకు, బాన్సువాడ డీఎస్పీ పి. విఠల్ రెడ్డి పర్యవేక్షణలో బాన్సువాడ టౌన్ ఎస్హెచ్ఓ టి. శ్రీధర్, సీసీఎస్ ఇన్స్పెక్టర్ సంతోష్ కుమార్, బాన్సువాడ ఎస్ఐ శిరీష మరియు సిబ్బందితో కలిసి మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ప్రత్యేక దర్యాప్తు చేపట్టారు.
సీసీ కెమెరా ఫుటేజీ మరియు ఇతర సాంకేతిక ఆధారాల ఆధారంగా అనుమానితుల కదలికలను గుర్తించి వారిని పట్టుకునేందుకు నిరంతరం నిఘా ఏర్పాటు చేశారు.
ఈ క్రమంలో 02.10.2026న అందిన విశ్వసనీయ సమాచారం మేరకు బొగ్గుగుడిసె చౌరస్తా సమీపంలో వెళుతున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. పోలీసుల విచారణలో వారు గౌలిగూడ కాలనీలో జరిగిన ఇంటి దొంగతనానికి పాల్పడినట్లు వెల్లడించారు. దొంగిలించిన బంగారు, వెండి ఆభరణాలను హైదరాబాద్‌లో విక్రయించేందుకు వెళ్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.
బాధితుడి ఇంటి పక్కనే నివాసం.. పథకం ప్రకారం చోరీ:
ఈ కేసులో నిందితులైన A1 దండుగుల మైసయ్య, A2 దండుగుల ఎల్లయ్య ఇద్దరూ బంధువులు. A1 మైసయ్య బాధితుడి ఇంటి పక్కనే నివాసం ఉండటంతో బాధితుల ఇంటి పరిస్థితులు, వారి రాకపోకలను కొంతకాలంగా గమనిస్తూ ఉండేవాడు. ఇదే క్రమంలో ఇద్దరూ కలిసి వైన్స్ కు వెళ్ళి మద్యం తాగిన అనంతరం, ఈ సంవత్సరం జూన్, జూలై నెలల్లో A1 మైసయ్య (06) దొంగతనం కేసుల్లో జైలుకు వెళ్లిన సమయంలో బెయిల్ కోసం అతని భార్య అప్పులు చేసిన విషయాన్ని చర్చించుకున్నారు. ఆ అప్పులను తీర్చేందుకు డబ్బులు అవసరం కావడంతో ఎలాగైనా దొంగతనం చేయాలని నిర్ణయించుకున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.
అదే సమయంలో A1 మైసయ్య బాధితుడి ఇంటికి తాళం వేసి ఉండటాన్ని గమనించాడు. ఇదే సరైన సమయమని భావించిన నిందితులిద్దరూ ఇంటి తాళం పగులగొట్టి లోపలికి ప్రవేశించి, బంగారు, వెండి ఆభరణాలను మరియు నగదు దొంగిలించి అక్కడి నుంచి సైకిల్ మోటార్ పై పరారయ్యారు.
అరెస్ట్ చేయబడిన నిందితుల వివరాలు:
A1. దండుగుల మైసయ్య @ మణికంఠ, తండ్రి: మైసయ్య, వయస్సు: 25 సంవత్సరాలు, బాన్సువాడ.
(నిందితుడిపై గతంలో 6 ఇంటి దొంగతనం కేసులు నమోదై ఉన్నాయి. ఇందులో బాన్సువాడ పోలీస్ స్టేషన్ పరిధిలో 4 దొంగతనం కేసులు, గాంధారి పోలీస్ స్టేషన్ పరిధిలో 2 దొంగతనం కేసులు ఉన్నాయి.)
A2. దండుగుల ఎల్లయ్య @ రాజు, తండ్రి: భీమయ్య, వయస్సు: 20 సంవత్సరాలు, బాన్సువాడ.
స్వాధీనం చేసుకున్న సొత్తు:
1 31.2 తులాల బంగారు ఆభరణాలు
2.3 kg ల వెండి ఆభరణాలు
3.రూ.9,700/- నగదు
4.నేరంలో ఉపయోగించిన Hero HF Deluxe మోటార్ సైకిల్, 2 మొబైల్ ఫోన్
నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కొరకు బిచ్కుంద కోర్టు నందు హాజరుపరచడం జరుగుతుందని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర, తెలిపారు.
ఈ కేసును ఛేదించడంలో కీలకంగా పనిచేసిన బాన్సువాడ డీఎస్పీ పి. విఠల్ రెడ్డి, బాన్సువాడ టౌన్ ఎస్.హెచ్.ఓ టి. శ్రీధర్, సీసీఎస్ ఇన్స్పెక్టర్ సంతోష్ కుమార్, బాన్సువాడ ఎస్ఐ శిరీష, క్రైమ్ టీం హెడ్ కానిస్టేబుల్ సాయికుమార్, కానిస్టేబుళ్లు పృథ్వీకుమార్, పాండురంగ, సుదర్శన్ రావు, రజిత మరియు సీసీఎస్ సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ మైసయ్య, కానిస్టేబుల్లు జె. రవి, శ్రీనివాస్, స్వామి చేసిన కృషిని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర, ఐపీఎస్ అభినందించారు.








