
కామారెడ్డి జిల్లా :k24 న్యూస్ తెలుగు
కామారెడ్డి మెడికల్ సెంటర్‌లో మంగళవారం నిర్వహించిన ప్రెస్ మీట్‌లో హైదరాబాద్ యశోద హాస్పిటల్స్ వైద్యులు అరుదైన రక్త సంబంధిత వ్యాధికి సంబంధించిన వివరాలను వెల్లడించారు.
అత్యంత అరుదైన, ప్రాణాంతక రక్త సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఓ గిరిజన యువతిని యశోద హాస్పిటల్స్ సోమాజిగూడ వైద్యులు విజయవంతంగా చికిత్స చేసి కాపాడారు.
నిజామాబాద్‌కు చెందిన ఈ యువతికి త్రోంబోటిక్ త్రోంబోసిటోపెనిక్ పర్పరా — టీటీపీ అనే అరుదైన రక్త సంబంధిత వ్యాధి ఉన్నట్లు వైద్యులు గుర్తించారు.
ఈ వ్యాధి కారణంగా రక్తంలో ప్లేట్‌లెట్లు గణనీయంగా తగ్గడంతో పాటు, కీలక అవయవాల పనితీరుపై కూడా ప్రభావం పడే ప్రమాదం ఉంటుందని వైద్యులు తెలిపారు.
రోగి పరిస్థితిని పరిశీలించిన వైద్యులు అత్యవసరంగా తెరాపెటిక్ ప్లాస్మా ఎక్స్చేంజి — ప్లాస్మా ఎక్స్చేంజ్ చికిత్సను ప్రారంభించారు. అనంతరం స్టెరాయిడ్ థెరపీతో పాటు ఇతర చికిత్సలను అందించారు.
చికిత్సకు రోగి క్రమంగా స్పందించడంతో ప్లేట్‌లెట్ కౌంట్ పెరిగింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి మెరుగుపడినట్లు వైద్యులు తెలిపారు.
డా. జి. విద్యుత్ కుమార్, కన్సల్టెంట్ క్లినికల్ హెమటాలజిస్ట్ & BMT ఫిజీషియన్, యశోద హాస్పిటల్స్ మాట్లాడుతూ…
“టీటీపీ అనేది చాలా అరుదైన, ప్రాణాంతక రక్త వ్యాధి. సరైన సమయంలో గుర్తించి, తెరాపెటిక్ ప్లాస్మా ఎక్స్చేంజి వంటి చికిత్స అందించడం ద్వారా రోగి ప్రాణాలను కాపాడవచ్చు” అని తెలిపారు.
టీటీపీ లో చిన్న చిన్న రక్త గడ్డలు ఏర్పడి ముఖ్యమైన అవయవాలకు రక్త సరఫరాకు అంతరాయం కలిగే అవకాశం ఉంటుందని వైద్యులు వివరించారు.
యశోద గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ గత మూడు దశాబ్దాలుగా అత్యున్నత వైద్య సేవలను అందిస్తోందని, హైదరాబాద్‌లోని తమ ఆసుపత్రుల్లో అత్యాధునిక సదుపాయాలతో వేలాది మంది రోగులకు చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.
కామారెడ్డి మెడికల్ సెంటర్‌లో నిర్వహించిన ఈ ప్రెస్ మీట్‌లో అరుదైన వ్యాధి, దాని లక్షణాలు, సకాలంలో చికిత్స ప్రాముఖ్యతపై వైద్యులు వివరించారు.




