
మందమర్రి, ఆగస్టు 13:
మందమర్రి అటవీ ప్రాంతాల్లో వేటగాళ్ల ఉచ్చులు, అక్రమ వేటతో వన్యప్రాణులు మృత్యువాత పడుతున్నాయి. గతంలో జింకలు, దుప్పులు, ఎలుగుబంట్లు, నక్కలు, తోడేళ్లు, నెమళ్లు, కుందేళ్లు, వివిధ పక్షి జాతులతో కళకళలాడిన అడవులు ప్రస్తుతం క్షీణించడంతో వన్యప్రాణులకు ఆహారం, ఆవాసం కొరత ఏర్పడింది.పాత ఆర్‌కే-1 గని, సమ్మక్క-సారక్క గద్దెలు, శంకర్‌పల్లి, చిర్రకుంట, పాలవాగు, సోలార్ విద్యుత్ కేంద్రం పరిసరాల్లో సాయంత్రం, రాత్రి వేళల్లో వేట జరుగుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. వేటగాళ్లు ఉచ్చులు, ఆహారం పేరుతో వన్యప్రాణులను ఆకర్షించి హతమార్చి మాంసాన్ని విక్రయిస్తున్నారని ఆరోపిస్తున్నారు. వన్యప్రాణులను కాపాడేందుకు అటవీ, పోలీస్, ప్రభుత్వ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు, పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు.
— కొలుగూరి విజయ్‌కుమార్, టౌన్ రిపోర్టర్, మందమర్రి




