
కామారెడ్డి కేంద్రంలో సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి కార్యక్రమాన్ని మంగళవారం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో జిల్లా కలెక్టర్ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఎన్.వై.గిరి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మాట్లాడుతూ, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడిన గొప్ప యోధుడని అన్నారు. సామాజిక అసమానతలను ఎదుర్కొంటూ ప్రజల కోసం ఆయన చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిందని పేర్కొన్నారు. పాపన్న గౌడ్ ధైర్యసాహసాలు, ఆత్మగౌరవం, సామాజిక న్యాయం కోసం చేసిన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని అన్నారు.
సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేయడం, సమానత్వం, సామాజిక న్యాయం వంటి విలువలను ముందుకు తీసుకెళ్లడం ద్వారా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాలను కొనసాగించాలని కలెక్టర్ సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ అభివృద్ధి అధికారి నర్సయ్య, గౌడ సంఘాల ప్రతినిధులు, బహుజన సంఘాల నాయకులు, జిల్లా అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు, మీడియా ప్రతినిధులు తదితరులు పాల్గొని సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్‌కు ఘనంగా నివాళులర్పించారు.




