
రెండు బైకులు ఢీకొని ఇద్దరు మృతి,
ఒకరికి తీవ్ర గాయాలు
నల్లగొండ జిల్లా, తెలుగు కే న్యూస్ : అడవిదేవులపల్లి: మండల పరిధిలోని ముదిమాణిక్యం గ్రామానికి వెళ్లే రహదారిపై గురువారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు, అతివేగంగా ఎదురెదురుగా వస్తున్న రెండు మోటార్ సైకిళ్లు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో పగిళ్ల అక్కులు, బొమ్మకంటి నరసయ్య అక్కడికక్కడే మృతి చెందారు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో వెంటనే మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఎస్ఐ శేఖర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.





