
హైదరాబాద్, k24 న్యూస్ తెలుగు జూన్ 23: మడ్ ఫోర్ట్ అంబేడ్కర్ హట్స్ బస్తీలో నివసిస్తున్న పేదల ఇళ్లను కూల్చివేయాలనే ప్రయత్నాలను వెంటనే నిలిపివేయాలని తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర నాయకులు సయ్యద్ ఇస్మాయిల్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
మంగళవారం బంజారాహిల్స్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మడ్ ఫోర్ట్ అంబేడ్కర్ బస్తీలో గత 40 ఏళ్లుగా సుమారు 650 పేద కుటుంబాలు నివాసం ఉంటున్నాయని తెలిపారు. ఇంతకాలంగా అక్కడ జీవనం సాగిస్తున్న కుటుంబాలను రోడ్డున పడేయడం అన్యాయమని అన్నారు.
ప్రభుత్వం, కంటోన్మెంట్ అధికారులు బుల్డోజర్లతో వచ్చి ఇళ్లను కూల్చివేస్తామని బెదిరించడం వల్ల బస్తీ ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని పేర్కొన్నారు. బస్తీ వాసులకు తెలంగాణ రక్షణ సేన పూర్తిగా అండగా ఉంటుందని, వారి హక్కుల కోసం పోరాటం చేస్తామని హామీ ఇచ్చారు.
ఎన్నికల సమయంలో శాశ్వత పట్టాలు ఇప్పిస్తానని హామీ ఇచ్చిన స్థానిక ఎమ్మెల్యే ఇప్పుడు స్పందించడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. బస్తీ వాసుల వద్ద ఆధార్ కార్డులు, విద్యుత్ కనెక్షన్లు, గ్యాస్ బిల్లులు వంటి అన్ని గుర్తింపు పత్రాలు ఉన్నాయని చెప్పారు.
పేదల ఇళ్ల జోలికి వస్తే ప్రజా ఉద్యమం చేపడతామని సయ్యద్ ఇస్మాయిల్ హెచ్చరించారు.
ఈ సమావేశంలో బస్తీ వాసులు జంగమ్మ, లక్ష్మీ, సరస్వతి, మల్లమ్మతో పాటు శివకుమార్, శ్రీనివాస్, యాదయ్య, సరిత, సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

