యువత డ్రగ్స్ బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలి: పిడిశెట్టి రాజు

 

యువత భవిష్యత్తును కాపాడేందుకు విస్తృత తనిఖీలు, అవగాహన కార్యక్రమాలు కొనసాగుతున్నాయని వెల్లడి

కోహెడ, జూన్ 20: యువత, విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేసే మత్తు పదార్థాల నిర్మూలనకు సమాజంలోని ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సామాజిక కార్యకర్త, కంటెస్టెడ్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పిడిశెట్టి రాజు పిలుపునిచ్చారు. శనివారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలోని కోహెడ మండల కేంద్రంలో ఆయన మాట్లాడారు.
డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా పోలీస్, ఎక్సైజ్ తదితర శాఖలు సమన్వయంతో విస్తృత స్థాయిలో తనిఖీలు నిర్వహిస్తున్నాయని తెలిపారు. యువతలో మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై ప్రజలకు అవగాహన కల్పించడం అత్యంత అవసరమన్నారు.
వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా మత్తు మందులు, ఇంజెక్షన్ల విక్రయాలకు పాల్పడే మెడికల్ షాపులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు మెడికల్ దుకాణాల్లో తరచూ తనిఖీలు నిర్వహించాలని కోరారు.
పాఠశాలలు, కళాశాలల్లో “స్నేహిత” కార్యక్రమం ద్వారా విద్యార్థులకు డ్రగ్స్ దుష్ప్రభావాలపై విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో పోలీస్ శాఖ కూడా చురుకుగా భాగస్వామ్యం అవుతోందన్నారు.
డ్రగ్స్ నిర్మూలనలో భాగంగా ప్రభుత్వ, ప్రైవేట్ హాస్టళ్లు, ఆర్టీసీ కార్గో కేంద్రాలు, ప్రైవేట్ పార్సిల్ సంస్థలు, ఆన్‌లైన్ డెలివరీ సంస్థల గోదాముల్లో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. డ్రగ్ డిటెక్షన్ కిట్లు, పోలీస్ డాగ్ స్క్వాడ్లు, నాకాబందీ తనిఖీల ద్వారా మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై నిఘా ఉంచుతున్నామని చెప్పారు.
మాదక ద్రవ్యాల వినియోగం, సరఫరా, అక్రమ రవాణా వంటి నేరాలకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
డ్రగ్స్ నిర్మూలన కోసం నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ యువతలో చైతన్యం కల్పిస్తున్న పిడిశెట్టి రాజును సిద్దిపేట జిల్లా అదనపు డీసీపీ కుషాల్కర్ ప్రత్యేకంగా అభినందించినట్లు తెలిపారు.

Picture of కె24 న్యూస్ తెలుగు

కె24 న్యూస్ తెలుగు

Katta Ravinder is a journalist with five years of experience in print and electronic media, committed to responsible journalism.