తుఫాను నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి – ఎంపీ వల్లభనేని బాలశౌరి

- జనసైనికులు సహాయక చర్యల్లో పాల్గొనాలి
బంగాళాఖాతంలో ఏర్పడిన ‘అర్నబ్’ తుఫాను నేపథ్యంలో మచిలీపట్టణం పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మచిలీపట్టణం ఎంపీ శ్రీ వల్లభనేని బాలశౌరి గారు సూచించారు. తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు, బలమైన గాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, అధికారులు జారీ చేసే సూచనలు, హెచ్చరికలను తప్పనిసరిగా పాటించాలని కోరారు.
తీర ప్రాంత ప్రజలు, లోతట్టు ప్రాంతాల నివాసితులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, మత్స్యకారులు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లవద్దని సూచించారు. విద్యుత్ స్తంభాలు, తెగిపడిన విద్యుత్ తీగలు, పాత భవనాలు, చెట్లకు దూరంగా ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో అధికారుల సూచనల మేరకు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని తెలిపారు.
జనసైనికులు సహాయక చర్యల్లో పాల్గొనాలి
తుఫాను సమయంలో ప్రజలకు అండగా నిలవాలని ఎంపీ బాలశౌరి గారు జనసేన నాయకులు, కార్యకర్తలకు సూచించారు. స్థానిక అధికారులతో సమన్వయం చేసుకుంటూ అవసరమైన చోట సహాయక చర్యల్లో పాల్గొనాలని, ఆహారం, తాగునీరు, మందులు వంటి అత్యవసర సదుపాయాలు అవసరమైన వారికి అందించేందుకు సహకరించాలని కోరారు.
లోతట్టు ప్రాంతాల్లో చిక్కుకున్నవారు, వృద్ధులు, దివ్యాంగులు, చిన్నపిల్లలు, ఇతర అవసరాల్లో ఉన్నవారికి సహాయం అందించేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. అయితే, ప్రజలు తమ భద్రతను ప్రమాదంలో పెట్టకుండా, అధికారుల అనుమతి మరియు సూచనల మేరకే సహాయక చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.
అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి
తుఫాను కారణంగా ఎక్కడా ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో ముందస్తు చర్యలు తీసుకోవాలని ఎంపీ బాలశౌరి గారు కోరారు. లోతట్టు ప్రాంతాలు, తీర గ్రామాలు, ముంపు ముప్పు ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, అవసరమైన చోట సహాయక శిబిరాలు, తాగునీరు, ఆహారం, వైద్య సదుపాయాలు సిద్ధంగా ఉంచాలని సూచించారు.
విద్యుత్, రహదారులు, తాగునీటి సరఫరా వంటి అత్యవసర సేవలకు అంతరాయం కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని, అత్యవసర పరిస్థితుల్లో తక్షణ స్పందనకు సిబ్బందిని అందుబాటులో ఉంచాలని కోరారు.
ఎంపీ కార్యాలయము,
మచిలీపట్టణం.
ఇదీ చదవండి :: రైతులకే షరతులా..?












