సిద్దిపేట కమిషనరేట్ పరిధిలో 500కు పైగా ట్రాఫిక్ కేసులు నమోదు

- మద్యం తాగి వాహనాలు నడిపిన వారిపై ప్రత్యేక నిఘా – సీపీ రష్మి పెరుమాళ్
సిద్దిపేట, తెలుగు కే న్యూస్ అక్టోబర్ 28: రోడ్డు ప్రమాదాల నివారణ, ప్రజల ప్రాణభద్రతే లక్ష్యంగా సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు నిర్వహించిన ప్రత్యేక వాహన తనిఖీల్లో 500కు పైగా కేసులు నమోదు చేశారు. పోలీస్ కమిషనర్ రష్మి పెరుమాళ్, ఐపీఎస్ ఆదేశాల మేరకు మంగళవారం రాత్రి (అక్టోబర్ 27) కమిషనరేట్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో ఈ తనిఖీలు నిర్వహించారు.
వివిధ ఉల్లంఘనలపై కేసులు
ప్రత్యేక తనిఖీల్లో భాగంగా మద్యం తాగి వాహనాలు నడిపిన వారిపై 77 కేసులు, అతివేగంగా వాహనాలు నడిపిన వారిపై 91 కేసులు నమోదు చేశారు. డ్రైవింగ్ లైసెన్స్ వెంట తీసుకెళ్లని వారిపై 193 కేసులు, నంబర్ ప్లేట్ లేని లేదా సక్రమంగా లేని వాహనాలపై 42 కేసులు, హెల్మెట్ ధరించకుండా ప్రయాణించిన వారిపై 35 కేసులు, వాహన పత్రాలు లేని వారిపై 28 కేసులు, డ్రైవింగ్ లైసెన్స్ అసలు లేని వారిపై 12 కేసులు నమోదు చేశారు. ఇతర ట్రాఫిక్ ఉల్లంఘనలను కలుపుకొని మొత్తం 500కు పైగా కేసులు నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు.
ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ రష్మి పెరుమాళ్ మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాలను అరికట్టి ప్రజల ప్రాణాలను కాపాడటమే లక్ష్యంగా ప్రత్యేక తనిఖీలు చేపడుతున్నట్లు తెలిపారు. వాహనదారులు మద్యం మత్తులో వాహనాలు నడపవద్దని, అతివేగం, రాంగ్ రూట్‌లో ప్రయాణించడం వంటి ప్రమాదకర చర్యలకు దూరంగా ఉండాలని సూచించారు.
ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కార్లలో ప్రయాణించే వారు సీటుబెల్ట్ పెట్టుకోవాలని పేర్కొన్నారు. డ్రైవింగ్ లైసెన్స్‌తో పాటు వాహనానికి సంబంధించిన పత్రాలను వెంట ఉంచుకోవాలని సూచించారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రత్యేక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని స్పష్టం చేశారు.
ప్రజలందరూ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ, పోలీసులకు సహకరించి సురక్షిత ప్రయాణానికి తోడ్పడాలని సీపీ రష్మి పెరుమాళ్ కోరారు.
ఇదీ చదవండి :: రైతులకే షరతులా..?












