పోక్సో చట్టంపై విద్యార్థులకు అవగాహన:

- సిరిసిల్ల రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి గడ్డం మేఘన.
సిరిసిల్ల పట్టణం,అక్టోబర్ 29, K24 న్యూస్ తెలుగు ప్రతినిధి.
విద్యార్థులు జీవితంలో ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని, వాటిని సాధించేందుకు పట్టుదలతో, క్రమశిక్షణతో నిరంతరం కృషి చేయాలని సిరిసిల్ల రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి కుమారి గడ్డం మేఘన సూచించారు. బాలల హక్కుల పరిరక్షణ, బాలలపై లైంగిక నేరాల నివారణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని ఆమె పిలుపునిచ్చారు. గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని గీతానగర్ జిల్లా పరిషత్ ఉన్నత బాలికల పాఠశాలలో ‘సురక్షిత్ బచ్పన్ అభియాన్’ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు అవగాహన కల్పించారు. తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ, హైదరాబాద్ ఆదేశాల మేరకు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షురాలు పి. నీరజ సూచనలతో జిల్లా వ్యాప్తంగా పాఠశాల స్థాయిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి గడ్డం మేఘన మాట్లాడుతూ.. పోక్సో (POCSO) చట్టం ప్రకారం బాలలపై లైంగిక వేధింపులు లేదా అనుచిత ప్రవర్తనకు సంబంధించిన ఘటనలు చోటుచేసుకున్నప్పుడు వాటిని నిర్భయంగా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. బాధిత పిల్లలకు తక్షణ రక్షణ, న్యాయ సహాయం అందేలా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. బాలలపై జరిగే లైంగిక నేరాలను దాచిపెట్టకుండా చట్టప్రకారం సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని తెలిపారు. బాధిత పిల్లల వ్యక్తిగత వివరాల గోప్యతను కాపాడటంతో పాటు వారికి మానసిక ధైర్యం, భరోసా కల్పించాలని సూచించారు. బాలల హక్కులపై అవగాహన పెంపొందించుకోవడం ద్వారా సురక్షితమైన వాతావరణాన్ని కల్పించవచ్చని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయుడు ఎం.తిరుపతి, లోక్ అదాలత్ సభ్యుడు చింతోజు భాస్కర్, న్యాయవాదులు ఆడెపు వేణు, కళ్యాణి, కుంట శ్రీనివాస్, ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి :: వేలిముద్రలు దొరకకుండా ఆనవాళ్లపై కారం చల్లిన దొంగ













