కామారెడ్డి మున్సిపాలిటీపై వచ్చిన ఆరోపణలపై సమగ్ర విచారణ చేపట్టాలి జిల్లా కలెక్టర్

- మున్సిపాలిటీలో కొందరు అక్రమ వసులు, అవకతవకాలు, దినపత్రికల్లో వచ్చిన కథనాలపై విచారణ చేపట్టాలని అదనపు కలెక్టర్ ఎన్ వై గిరి కి జిల్లా కలెక్టర్ ఆదేశం
కామారెడ్డి జిల్లా నవంబర్ 4 :k24 న్యూస్ తెలుగు : కామారెడ్డి మున్సిపాలిటీపై వచ్చిన ఆరోపణలపై సమగ్ర విచారణకు ఆదేశం
నిర్దిష్ట గడువులోగా విచారణ నివేదిక సమర్పించాలి: జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
కామారెడ్డి మున్సిపాలిటీలో కొందరు కౌన్సిలర్లు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని, మున్సిపల్ పాలనలో పలు అవకతవకలు జరుగుతున్నాయని ఇటీవల పలు దినపత్రికల్లో ప్రచురితమైన కథనాలపై జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ స్పందించారు. ఈ ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఎన్.వై. గిరిని ఆదేశించారు.
ఈ విచారణలో భాగంగా మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగం పరిధిలో చేపట్టిన టెండర్ల ప్రక్రియ, పారిశుద్ధ్య సిబ్బంది నియామకాలు, వారి హాజరు, వేతనాల చెల్లింపులు, సీసీ కెమెరాల ఏర్పాటు పనులు, వాటిలో ప్రజాప్రతినిధుల కుటుంబ సభ్యుల జోక్యంపై వచ్చిన ఆరోపణలను క్షుణ్ణంగా పరిశీలించనున్నారు.
అదేవిధంగా పట్టణ ప్రణాళికా విభాగం జారీ చేసిన నోటీసులు, వాటిపై తీసుకున్న తదుపరి చర్యలు, మున్సిపల్ కౌన్సిల్ నెలవారీ సమావేశాల నిర్వహణ, గణేష్ నిమజ్జనం ఏర్పాట్ల కోసం కొనుగోలు చేసిన ఇనుప సామగ్రి వినియోగం, అనంతరం వాటి విక్రయానికి సంబంధించిన వివరాలను విచారణలో పరిశీలించనున్నారు.
మున్సిపల్ వాహనాల నెలవారీ ఇంధన వినియోగం, వ్యాపార అనుమతుల జారీ, ఇంటి పన్ను మదింపు ప్రక్రియ తదితర అంశాలపైనా సమగ్రంగా విచారణ జరిపి వాస్తవాలను నిర్ధారించనున్నారు.
ఆరోపణలు రుజువైతే బాధ్యులపై చర్యలు
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మాట్లాడుతూ, మున్సిపాలిటీ పరిధిలో ప్రజలకు అందించే సేవల్లో ఎలాంటి అవకతవకలు, అక్రమ వసూళ్లు జరిగినా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. విచారణలో ఆరోపణలు రుజువైతే బాధ్యులైన ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బందిపై నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
మున్సిపల్ సేవల కోసం ఎవరైనా డబ్బులు డిమాండ్ చేసినా, ప్రజలను బెదిరింపులకు గురిచేసినా సంబంధిత ఆధారాలతో ఫిర్యాదు చేయాలని ప్రజలకు సూచించారు. ఫిర్యాదులను అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) కార్యాలయంలో లేదా కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో సమర్పించవచ్చని తెలిపారు.
ఫిర్యాదుదారుల వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని కలెక్టర్ స్పష్టం చేశారు. మున్సిపల్ పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం ఉండేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
ఇదీ చదవండి :: ఇందిరమ్మ ఇళ్లు పేదలకు అందేనా..? పార్టీ కార్యకర్తలకే ప్రాధాన్యతా!













